ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు కొనసాగుతుంది. ఇందులో భాగంగా 31వ వార్డు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కౌన్సిలర్ అభ్యర్థి మురహరి పద్మావతి గురువారం వార్డు వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి ప్రచారం ఊపందుకుంది. వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లిన ఆమె, స్థానిక ప్రజలను ఆత్మీయంగా పలకరించి తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా మురహరి పద్మావతి మాట్లాడుతూ.. మీ బిడ్డగా మీ ముందుకు వచ్చాను.. నన్ను గెలిపిస్తే మీ ఇంటి సేవకురాలిగా నిరంతరం అందుబాటులో ఉంటాను అని అన్నారు. వార్డులో ఏళ్ల తరబడి నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, వీధిదీపాల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తానని, వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని హామీ ఇచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో వార్డులోని టీడీపీ నాయకులు మురహరి రాజశేఖర్, మన్సూర్ బాషా తదితరులు పాల్గొన్నారు.








