న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై పోలీసులు దాడి చేయడం, నిర్బంధించడం అత్యంత దుర్మార్గమని ఏపీ ఎన్జీవోస్ నేత ప్రభు తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో హక్కుల సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలిపే ఉద్యోగులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు నిరంతరం ప్రభుత్వ సేవలను అందిస్తున్న సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం, పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం సరికాదని ప్రభు పేర్కొన్నారు.
ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి, వాటిని అణచివేసేందుకు పోలీసులను ప్రయోగించడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉద్యోగ సంఘాలతో వెంటనే చర్చలు జరిపి, సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభు విజ్ఞప్తి చేశారు.












