ఎమ్మిగనూరు పట్టణం, ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ (సూర్య పత్రిక) సెప్టెంబర్ 05
ఎమ్మిగనూరు పట్టణంలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సమీక్ష సమావేశం : ఎమ్మెల్యే నాగేశ్వర్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు, అగ్నిమాపక చర్యలపై ఆయన దృష్టి సారించారు.
ఎమ్మిగనూరు పట్టణంలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా మరియు సురక్షితంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గణేష్ ఉత్సవ కమిటీలు, గణేష్ మండపాల నిర్వాహకులు మరియు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిమజ్జన కార్యక్రమంలో భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు, అగ్నిమాపక మరియు రక్షణ చర్యలు వంటి అంశాలపై సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అలాగే నిమజ్జనం జరిగే కాలువ పరిసరాల్లో తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రత, విద్యుత్ మరియు లైటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో పాటు శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ మరియు అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గణేష్ మండపాల నిర్వాహకులు, మూడు మండలాల సీఐలు, ఎస్సైలు, ట్రాఫిక్ ఎస్సై, ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది, APSRTC డిపో మేనేజర్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.











